Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలో కూడా కొన్ని ప్రాంతాలను వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది.
ఇవాళ ఏపీలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో.. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించారు. ఆవర్తనం ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రాలో.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని దాంతో.. జులై 18 వరకు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తమ్మీద ఏపీ, తెలంగాణ రెండూ రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
భారత వాతావరణ విభాగం (ఐఎండి) హైదరాబాద్ ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలోని అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.హైదరాబాద్ విషయానికొస్తే, సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈదురు గాలులతో పాటు అప్పుడప్పుడు బలమైన గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్‌లో గురువారం వరకు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ఈరోజు మాత్రమే నగరానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.మొత్తం రాష్ట్రానికి జారీ చేసిన పసుపు అలర్ట్ జూలై 19 వరకు కొనసాగుతుంది.గత రాత్రి హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురిసింది.మంచిర్యాలలో అత్యధికంగా 159.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 94.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.