Janasena Chief Pawan Kalyan: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రీ హరిరామజోగయ్య అభిలషించారు.
ఇటీవల హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీని.. మెరుగైన సంక్షేమ పథకాలతోనే కొట్టాలని ఆయన లేఖలో సూచించారు. ప్రజలను మభ్యపెట్టి వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోందని, అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే కూటమి మేనిఫెస్టోలో మెరుగైన పథకాలు ప్రవేశ పెట్టాలని తెలిపారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసుగెత్తి పోయారని.. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని మండిపడ్డారు. వైసీపీ పాలన వల్ల దిగువ, మధ్యతరగతి ప్రజలు పస్తులుండే పరిస్థితులు వచ్చాయన్నారు. పన్నుల పేరుతో వైసీపీ.. సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టాల్సిన పలు సంక్షేమ పథకాలను ఆయన సూచించారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి నెలకు రూ.2వేలు ఇవ్వాలని సూచించారు.వృద్ధాప్య పెన్షన్లు ఇంట్లో ఒకరు ఉంటే రూ.3వేలు, ఇద్దరు ఉంటే రూ.4 వేలు ఇవ్వాలని తెలిపారు.కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఎలక్ట్రిక్ బైకులు ప్రభుత్వం ఇవ్వాలి. డ్వాక్రా మహిళలకు కొంతమేర రుణమాఫి చేయాలి.విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయించాలి.తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వాలని హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు సూచించారు.