Hari Rama Jogaiah’s Analysis: ఏపీ రాజకీయాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య సంచలన విశ్లేషణ చేశారు. ఎన్‌డిఎ మిత్ర పక్షాల ఆత్మీయ సమావేశానికి పవన్ కళ్యాణ్‌ని పిలవడమంటే తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన చరిష్మాని ఉపయోగించడం ద్వారా లబ్ధి పొందాలనేదే ధ్యేయంగా కనిపిస్తోందని జోగయ్య అంచనా వేశారు. ఈ మీటింగుతో బిజెపి- జనసేన పొత్తు అధికారికంగా ఖాయమైనట్లేనని భావించాలని జోగయ్య చెప్పారు. వారాహి యాత్రతో జనసేన ప్రభంజనం సృష్టిస్తోందని, కాపులతో సహా బిసిలు, ఎస్‌సిలకి దఫదఫాలుగా రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి పదవులు దక్కాలనే పవన్ కళ్యాణ్ నినాదం బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల్లో జోష్ నింపిన మాట వాస్తవమని జోగయ్య వివరించారు.
ప్రజలు సరికొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, ఇప్పటికే 25 శాతం ఓట్లకి చేరువలో ఉన్న బిజెపి జనసేన కూటమి ఇతర పార్టీల పొత్తులపై ఆధారపడవద్దని జోగయ్య సలహానిచ్చారు. ఎస్‌సి, బిసిలని కూడా కలుపుకుని ప్రయాణం చేసినా, సంస్థాగతంగా బలమైన చర్యలు తీసుకోగలిగితే ఓటర్ల సంఖ్య 40 శాతం దాటుతుందని జోగయ్య విశ్లేషించారు. అయితే ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదనే ఒకే ఒక ధ్యేయంతో కలిసి ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలు గమనించినా , కలిసి ప్రయాణం చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుపడుతున్న తీరు చూసినా మరో రకమైన కోణం కూడా కనిపిస్తోందని జోగయ్య తెలిపారు. ఉభయుల గౌరవానికి భంగం కలగకుండా ఎన్నికల ముందే జనసేన, బిజెపి, టిడిపి కలిసి ప్రయాణం చేయటం ద్వారా రాజ్యాధికారం చేజిక్కించుకోవడం ఖాయమని జోగయ్య చెప్పారు. పొత్తులో భాగంగా జనసేన 75 శాసన సభా సీట్లలో పోటీ పెట్టి 50 సీట్లని కైవసం చేసుకోవడం ఖాయమని జోగయ్య అంచనా వేశారు. గౌరవ ప్రదమైన హోదాలతో అధికారాన్ని పంచుకుని ప్రజారంజకమైన హామీలతో కూడిన కామన్ మేనిఫెస్టోతో ప్రజా పరిపాలనని ఏర్పాటు చేయడం ఖాయమని జోగయ్య అన్నారు. అయితే జనసైనికులు ధైర్యంతో ప్రయాణించడంతోనే పొత్తుల కథకి మంచి ముగింపు వస్తుందని జోగయ్య సూచించారు.
లాభనష్టాలు రెండూ బేరీజు వేసుకుంటే రాష్ట్రంలో అధికారం చేబట్టడానికి బి.జె.పి.తో పొత్తు జనసేనకు ఎంతవరకు తోడ్పడుతుంతో కాలమే చెబుతుందని జోగయ్య అంటున్నారు. జనసేన, బి.జె.పి.ల పొత్తు వల్ల జనసేన కన్నా బి.జె.పి. లబ్ధిపొందే అవకాశమే ఎక్కువ అని చెప్పక తప్పదని జోగయ్య విశ్లేషించారు. టిడిపితో పొత్తు జనసేనకి లాభం కలిగించ వచ్చని చంద్రబాబు అనుభవం, ఎలక్షనీరింగ్, ఆర్థిక సహకారంలాంటి అంశాల్లో టిడిపితో పొత్తు వల్ల జనసేనకి లాభం కలగవచ్చని జోగయ్య చెబుతున్నారు. చంద్రబాబునాయుడి వయోభారం, నారా లోకేష్ అనుభవరాహిత్యం కొంతవరకు నష్టాన్ని చేకూరుస్తాయని జోగయ్య అంచనా వేశారు.
వై.ఎస్.ఆర్.సి.పి. పై ప్రజలలో అసంతృప్తి పెరిగి, గ్రాఫ్ పడిపోయి, ఓట్లశాతం 51శాతం నుండి 40శాతం వరకు పడిపోయిందని జోగయ్య అంటున్నారు. ఏపీలోని అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందని, జనసేన ఒంటరిగా వెళ్ళినా నెగ్గించుకోవడానికి రెడీగా ఉన్నారని జోగయ్య తెలిపారు. సంక్షేమం ప్రాతిపదికన కూడా నెగ్గలేని పరిస్థితి గ్రహించిన వైఎస్ఆర్ పార్టీ ఆఖరి అస్త్రంగా ఓట్లకి నోట్లు ఇచ్చి ఓటర్లని లొంగదీసుకునే ప్రయత్నం చేయచ్చని జోగయ్య ప్రజలని హెచ్చరించారు. అయితే వై.ఎస్.ఆర్. పార్టీ యిచ్చే డబ్బులు తీసుకున్నా, జనసేన అభ్యర్ధులు, కొద్దో గొప్పో యిచ్చినా, ఇవ్వకపోయినా జనసేనపార్టీ అభ్యర్ధులకు ఓట్లు వేయటానికే మార్పు కోరుకుంటున్న ఓటర్లు సిద్ధంగా ఉన్నారని జోగయ్య స్పష్టం చేసారు.