Janasena chief Pawan Kalyan: హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అధికారులు కఠినంగా వ్యవహరించాలి..(Janasena chief Pawan Kalyan)
బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గాయాల పాలైనవారికీ, అస్వస్థతకు గురైన వారికీ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. భవనాల్లో రసాయనాలు, ఇంధనాలు నిల్వ చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసిందన్నారు. నివాస ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చేవాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలి కోరారు.
హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బజార్ ఘాట్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని 6 వాహనాల్లో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామున మంటలు చెలరేగగా… కొన్ని సెకన్ల వ్యవధిలోనే పొగ నాలుగో అంతస్తు వరకు వ్యాపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ భవనంలో మొత్తం 60 మంది నివసిస్తున్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు నాలుగు నెలల చిన్నారి కూడా ఉంది.