Chandrababu’s Health: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్య వార్తలపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తోంది. రాజమహేంద్రవరం కేంద్ర కరాగారంలో వసతులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
వైద్యనిపుణులను అందుబాటులో ఉంచేలా..( Chandrababu’s Health)
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని జైళ్ల శాఖ అధికారులని ప్రభుత్వం ఆదేశించింది. స్నేహ బ్లాక్‌లో ప్రస్తుతం ఉన్న వసతుల్ని ప్రభుత్వం సమీక్షిస్తోంది. చంద్రబాబు అనారోగ్య సమస్యల నేపథ్యంలో వైద్య నిపుణుల్ని నిరంతరం అందుబాటులో ఉంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. డెర్మటాలజీ నిపుణులను నిరంతరం సెంట్రల్ జైలు ప్రాంగణంలో అందుబాటులో ఉంచే అవకాశాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిసింది. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
34 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు.. వాతావరణ మార్పులవల్ల ఇటీవల డీహైడ్రేషన్‌కు గురి కాగా.. స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే జైలు సూపరింటెండెంట్ అనుమతితో వైద్య బృందం పలు పరీక్షలు నిర్వహించారు. డెర్మటాలజీ డాక్టర్ల సలహాతో చంద్రబాబు మెనూలో కొన్ని మార్పులు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారన్న డాక్టర్లు తెలిపారు.జైలుకు వెళ్లిన డెర్మటాలజిస్టులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీత దేవి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు అధికారులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. బాబు ఆరోగ్యంపై ఎలాంటి భయాందోళనలు, అపోహలు అవసరంలేదని వెల్లడించారు. రాజమండ్రి పరిసరాల్లో కొన్ని రోజులుగా వాతావరణం అంతగా బాగోలేదని.. పైగా 2వేల మందికి పైగా ఖైదీలు ఉన్న జైలులో ఉండటంతో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.