Harsha Kumar Comments: కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. షర్మిలకు పీసీసీ చీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని.. కావాలంటే జాతీయ స్థాయిలో పదవి ఇచ్చుకోండని ఆయన సూచించారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న షర్మిల ఏపీలో ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. జగన్, షర్మిల ఇద్దరూ ఒకటేనన్నారు. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా తాము సేఫ్‌గా ఉండాలనేది జగన్, షర్మిల ఉద్దేశమని ఆయన ఆరోపించారు.
నిజంగా అన్నా చెల్లెళ్ల మధ్య వివాదాలు ఉంటే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం ఎందుకు పడుతుందని హర్షకుమార్ ప్రశ్నించారు. ఢిల్లీలో, హైదరాబాద్ లో ఎలా మాట్లాడాలనేది షర్మిలకు జగన్ ట్రైనింగ్ ఇచ్చాడని అన్నారు. జగన్ మోదీ వైపు, షర్మిల కాంగ్రెస్ వైపు ఉంటే రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా సేఫ్ గా ఉండవచ్చనేది వారి ఆలోచన అని అన్నారు. కావాలంటే షర్మిలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కాని కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా పంపవచ్చని చెప్పారు. అంతేకాని పీసీసీ సారధిగా మాత్రం ఇవ్వకూడదని అన్నారు. జగన్ పాలనలో దళితులకు చాలా అన్యాయం జరిగిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఎస్సీలకు ప్రతి ఏటా వేలాది లోన్లు మంజూరు చేసాము. లక్షరూపాయల సబ్సిడీ ఉండేది. వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు ఎస్సీలతో సహా అందరికీ ఫీజు రీఎంబర్స్ మెంట్ ఉండేది. ఇపుడు ఇవన్నీ తీసేసారని చెప్పారు. దళితులకు భూమి కొనుగోలు పధకం లేదని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్మేసుకోవడంతో దళితులకు రావలసిన సీట్లు రావడం లేదని అన్నారు. దళితులు దాడుల్లో చనిపోతే పది లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తామంటూ ప్రకటించిన జగన్ మిగిలిన ప్రమాదాల్లో చనిపోయిన వారికి కోటి రూపాయలు వరకూ ఇస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో దళితులపై దాడులు, అరాచకాలు పెరిగిపోయాయని హర్షకుమార్ ఆరోపించారు.