Jupalli Krishna Rao: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ పాలనను అంతమొందించడమే..(Jupalli Krishna Rao)
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన జూపల్లి.. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని మండి పడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫాసిస్టు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. ప్రజలను మోసం చేస్తూ నియంతలా పాలన సాగిస్తున్నారని.. ఎన్నికల కోసం అన్ని వర్గాలను వాడుకుంటున్నారన్నారు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతులను మోసం చేసేందుకు రుణమాఫీ, ఆర్టీసీ కార్మికులను లొంగదీసుకునేందుకు ప్రభుత్వంలో విలీనం వంటి కొత్త డ్రామాలు ఆడుతున్నాయని ఆక్షేపించారు. ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదని.. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమన్నారు.
జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కాంగ్రెస్, బీజేపీలు ఆయనతో చర్చలు జరిపాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఈనేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటితో పలుమార్లు చర్చలు జరిపారు. పొంగలేటి గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, జూపల్లి మాత్రం చేరలేదు. మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో చేరాలనుకున్నారు. కానీ భారీ వర్షాల కారణంగా సభ రెండుసార్లు వాయిదా పడింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా బిజీగా ఉన్నారు. దీనితో చివరకు నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.