Dadi Veerabhadra Rao:ఉత్తరాంధ్రలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి రాజీనామా లేఖని పంపించారు. ఆయన త్వరలో జనసేనలో చేరనున్నారు. రాజీనామాకు ముందు తన అనచరులతో సమావేశమయిన దాడి అనంతరం సీఎం జగన్ కు తన రాజీనామా పంపించారు.
పార్టీలో ప్రాధాన్యత లేక..(Dadi Veerabhadra Rao)
టీడీపీ ఆవిర్బావం నుంచి అందులోనే ఉన్న దాడి 2014 ఎన్నికల ముందు వైసీపీ లో చేరారు. అయితే ఎన్నికల్లో పార్టీ పరాజయం తరువాత పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు రత్నాకర్ కూడా విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరలా 2019 ఎన్నికల ముందు దాడి వైసీపీ లో చేరారు. అయితే గత ఐదేళ్లుగా ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. సీఎం జగన్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసారు. మరోవైపు అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్ నాధ్ తో దాడికి విబేధాలు ఉన్నాయి. రాజకీయంగా ఎటువంటి పదవులు లేకపోవడం, పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో దాడి బాగా అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పారు.
మరోవైపు దాడి వీరభద్రరావు రాజీనామా విషయంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రాజీనామా తన దృష్టికి వచ్చిందన్నారు. అనకాపల్లి నియోజకవర్డంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్దితులు ఉన్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరభద్రరావుకు టిక్కెట్ ఇచ్చే పరిస్దితి లేదన్నారు. ఎన్నికలముందు పార్టీలు మారడం సహజమని తెలిపారు. ఎన్నికల్లో కొంతమందికి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదన్నారు. అసంతృప్తులకు నచ్చచెబుతున్నామని అన్నారు.