Site icon Prime9

Woes for Seeds: తెలంగాణలో విత్తనాల కోసం రైతుల అవస్థలు

woes for seeds

woes for seeds

Woes for Seeds: తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము, జీలుగ, పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు. విత్తనాల కోసం ఉదయం నుంచే దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. రెండు రోజులుగా విత్తనాల కోసం తిరుగుతున్నా.. అధికారులు మాత్రం సరిపడినన్న విత్తనాలు సరాఫరా చేయడం లేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా నిల్వలు లేకపోవడంతో అన్న దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి చేజారడంతో పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన షాపుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. నాలుగు రోజులుగా విత్తనాలు మార్కెట్లో దొరకకపోవడంతో నిన్న గాంధీచౌక్‌ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. తీవ్రమైన ఎండలోనూ దుకాణాల ముందు బారులు తీరారు. ఒక్కో రైతుకు రెండు విత్తన ప్యాకెట్లనే ఇవ్వడంతో అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలో నిలబడే ఓపిక లేక దుకాణాల్లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నించారు. ఈ నేపథ్యంలో గాంధీచౌక్‌లోని శ్రీనివాస ఫెర్టిలైజర్‌ దుకాణం వద్ద పోలీసులు, రైతులకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

గంటల తరబడి క్యూ లైన్లో..( Woes for Seeds)

ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. జీలుగు, జనుము, పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉంటున్నారు. డిమాండ్ ఉన్నరకం పత్తి విత్తనాల కోసం అన్నదాతలు బారులు తీరారు. విత్తన షాపులు తెరవక ముందే నుంచే విత్తన ప్యాకెట్ల కోసం రైతులు క్యూలైన్లు కట్టి నిరీక్షిస్తున్నారు. రైతులకు సరిపడా నిల్వలు స్టోర్ చేసుకోవడంతో ప్రభుత్వం విఫలమయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఎందుకు విత్తనాలను దిగుమతి చేసుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు తగినన్నీ విత్తనాలను అందించాలని కోరుతున్నారు.

ఇక రైతుల ఆందోళనలపై ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్‌లో అప్పుడే రైతు కష్టాలు మెుదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయశాఖ మంత్రి ఎక్కడ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప, రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Exit mobile version