Farmers Handcuffed : యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేశారు. రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతుల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకువెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.
ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని ఆందోళన..( Farmers Handcuffed)
రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. నలుగురు రైతులను కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా సంకెళ్లు వేయడంపై రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం కొట్లాడితే సంకెళ్లు వేస్తారా అని నిలదీశారు. రైతులకు సంకెళ్లు వేయడం పట్ల కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.గత నెల 30న ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని యాదాద్రి కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు..
పద్నాలుగు రోజులుగా రైతులు నల్గొండ జిల్లా జైలులో ఉన్నారు. 14రోజుల రిమాండ్ ముగియడంతో కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో రైతులకు సంకెళ్లు వేసి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు పోలీసులు సంకెళ్లు వేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా సార్లు పోలీసులు.. రైతులకు సంకెళ్లు వేసిన సందర్భాలున్నాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఘటనలో అరెస్టయిన 10మంది రైతులను.. ఇదే రకంగా సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. తమ పంటను అమ్ముకునేందుకు వచ్చి గిట్టుబాటుధర కావాలని అడిగిన రైతులను అరెస్టు చేయడమే కాకుండా సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకురావటాన్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.కొండపోచమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపైనా పోలీసులు ఇదే కాఠిన్యాన్ని ప్రదర్శించారు. పరిహారం కోసం ఆందోళనకు దిగిన నిర్వాసితులపై లాఠీలు ఝుళిపించారు.