East Godavari District: భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలం.

భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలమవుతోంది. అల్లూరిజిల్లాలో గోదావరి, శబరి నదులకి వచ్చిన వరదలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాలకి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేరుకున్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు.

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 07:36 PM IST

East Godavari District: భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలమవుతోంది. అల్లూరిజిల్లాలో గోదావరి, శబరి నదులకి వచ్చిన వరదలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాలకి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేరుకున్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు. వరద ముంపు బాధితుల సమస్యలని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులని తక్షణమే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని ఆదేశించారు.

 

చేపల వేటకి వెళ్ళవద్దు..(East Godavari District)

ఇక కాట్రేని కోన మండలం చిర్ర యానాంలో సముద్రం 100 మీటర్లు ముందుకు వచ్చింది. తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. దీంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళనకి గురవుతున్నారు. మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించారు. అధికారుల హెచ్చరికలతో మత్స్యకారుల వేట బోట్లు ఎక్కడికక్కడ ఒడ్డుకి చేరాయి. యానాం వారధి వద్ద ఉదృతం గా గోదావరి ప్రవహిస్తోంది… లంక, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలోని భద్రాచలం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకి గోదావరికి వరద నీరు పోటెత్తింది. భద్రాచలం వద్ద 43 అడుగులకి వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. దిగువకు విడుదల చేసిన వరద నీటితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం తోడవడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ గోదావరి వరద నీటితో దేవీపట్నంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండి పోచమ్మ ఆలయ గోపురాన్ని గోదావరి వరదలు తాకాయి. ఈ వరదల కారణంగా పాపికొండల విహార యాత్రకు సంబంధించిన బోట్లను కూడా తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు.