Bhatti Vikramarka: అర్హులైన దరఖాస్తుదారులందరికీ ప్రభుత్వ పధకాలు అందుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఆరు హామీలు అమలు చేస్తాము..(Bhatti Vikramarka)
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడం ప్రారంభించింది. అదేవిధంగా మెరుగైన రాజీవ్ ఆరోగ్య శ్రీ ఆరోగ్య పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. మీకు వర్తించే అన్ని కాలమ్‌లను పూరించి దరఖాస్తులను సమర్పించండని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల మంజూరు విషయంలో తన ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించారు. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌లో చేరమని మా ప్రభుత్వం ఎవరినీ బెదిరించదని చెప్పారు.ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలను అమలు చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పేదల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన సూచించారు.ఇది దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వమని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల వద్దకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరి నుంచి దరఖాస్తులు స్వీకరస్తామని స్పష్టం చేశారు. పాదయాత్రలో ఎంతో మంది తనకు సమస్యలు తెలిపారని భట్టి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక జీవితాలు మారుతాయని అనుకున్నామని కానీ ఏం మారలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. అందరి సమస్యలు తెలుసుకుని ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని హామి ఇచ్చారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రజాపాలన ప్రారంభోత్సవానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరవ్యాప్తంగా 600 కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లోని అధికారుల వద్ద తమ సందేహాలను ఓపికగా నివృత్తి చేసుకొని ఫారమ్‌లను నింపాలని ఆయన ప్రజలకు సూచించారు. చాలా మంది దరఖాస్తుదారులు నల్గొండ, మహబూబ్‌నగర్ మరియు వరంగల్‌లోని పూర్వ జిల్లాల్లోని తమ ప్రాంతాల్లోని నిర్దేశిత కేంద్రాలకు ఉదయం 8 గంటల నుండి చేరుకుని, ప్రభుత్వం అందించిన వాలంటీర్ల సహాయంతో దరఖాస్తులను పూరించడం ప్రారంభించారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు తెరిచారు. 2,769 పంచాయతీలు మరియు 3,626 మునిసిపల్ వార్డుల్లో ప్రజాపాలన ప్రారంభమైంది. 3,714 మంది అధికారులు మరియు నోడల్ అధికారుల బృందానికి జనవరి 6, 2024 వరకు కొనసాగే కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.