Hyderabad: హైదరాబాద్ లోటస్ పాండ్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. లోటస్ పాండ్‌లో రోడ్డును ఆక్రమించి వైఎస్ ఫ్యామిలీ నిర్మాణాలు చేపట్టింది. ఫుట్‌పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టులు నిర్మించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకే ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
స్థానికుల హర్షం..(Hyderabad)
ఇలా ఉండగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు స్వాగతించగా, జగన్ మద్దతుదారులు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టారని వారంటున్నారు. తాజాగా ఏపీలో ప్రభత్వం మారినందునే ఇపుడు ఈ నిర్మాణాలు తొలగించడం ప్రారంభించారని వారు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో జగన్ ఇంటిపై కూడా ఇలాంటి ఫిర్యాదులు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. మరి అక్కడ కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం వీటిపై ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి..