Site icon Prime9

Teenmar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గెలుపు

Teenmar Mallanna

Teenmar Mallanna

 Teenmar Mallanna: వరంగల్‌- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్ తీన్మార్‌ మల్లన్న విజయం సాధించారు. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం.. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి కంటే మల్లన్న 14 వేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉండటంతో ఆయన గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందించారు. కాగా గత నాలుగుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన ఈ స్థానంలో తాజాగా కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు.

తొలి ప్రాధాన్య ఓట్లతో..( Teenmar Mallanna)

బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్‌ ప్రక్రియ వరకు మల్లన్నకు రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఎలిమినేషన్‌ ప్రక్రియలో రాకేశ్‌రెడ్డి, మల్లన్న కంటే సుమారు 4 వేల వరకు ఎక్కువ ఓట్లు సాధించినా.. అప్పటికే మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18 వేల పైచిలుకు ఆధిక్యం దక్కింది. మల్లన్న గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు, ఆయన అనుచరులు నల్గొండలోని లెక్కింపు కేంద్రం బయట బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.

స్వతంత్ర అభ్యర్థి, నాలుగో స్థానంలో ఓట్లు సాధించిన పాలకూరి అశోక్, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిలకు కలిపి.. తొలి ప్రాధాన్యం కింద 73 వేల 110 ఓట్లు పడగా.. వీటిలో సుమారు 20 వేల బ్యాలెట్‌ పత్రాల్లో ఆ ఓటర్లు రెండో ప్రాధాన్య ఓట్లు వేయలేదు. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లు తనకే వస్తాయని ధీమాగా ఉన్న రాకేశ్‌రెడ్డి ఓట్లు కోల్పోయి.. ఓటమిని అంగీకరించారు. ‘సాంకేతికంగా ఓడినా.. నైతికంగా విజయం తనదేనని రాకేష్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీ తరఫున 32 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు మంత్రులున్నా వారి అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చాను. ఓడినా ప్రజల మధ్యనే ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు, ఓటేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, పట్టభద్రులందరికీ ధన్యవాదాలు’ అని రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

మూడోసారి పోటీ చేసి..

కాగా తీన్మార్‌ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి. ఒకసారి శాసనసభకు కూడా పోటీ చేశారు. తొలిసారి 2015లో పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా.. అనంతరం 2019లో హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2021 పట్టభద్రుల ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉప ఎన్నికలో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు.

 

Exit mobile version