CM YS Jaganmohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులని చూశారు.గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంపుని కూడా సీఎం జగన్ గమనించారు. గత ప్రభుత్వంలో ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని సిఎం జగన్ పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని అధికారులు సిఎం జగన్‌కి చెప్పారు. 12వేల 911కోట్ల 15లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మెమొరాండం జారీచేసిందని, దీన్ని కేంద్ర జలశాఖకు లేఖద్వారా తెలిపిందని అధికారులు వివరించారు. సైడ్‌వాల్ డిజైన్లన్నీ కేంద్ర జలసంఘం ఖరారు చేసిందని, వారి ఆమోదంతోనే పనులు చేశామని అధికారులు సిఎం జగన్ దృష్టికి తెచ్చారు. సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారిచ్చే సూచనల ఆధారంగా వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు.
ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి..(CM YS Jaganmohan Reddy)
ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయని సీఎం అన్నారు. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారని సీఎం జగన్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారని సిఎం జగన్ చెప్పారు. ఫలితంగా ఈ ఖాళీలగుండా వరదనీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిఎం జగన్ వివరించారు. ఈఎస్‌ఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్ దారుణంగా దెబ్బతిందని , దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాదు, 2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని సిఎం జగన్ వివరించారు.
డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలి..
దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని అధికారులు సిఎం జగన్‌కి చెప్పారు. షెడ్యూలు ప్రకారం,.. నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలని సీఎం జగన్ సూచించారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దాలన్న సిఎం పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని ఆదేశించారు. పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో హోటల్ ఏర్పాటుకూడా చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ అధికారులని కోరారు.