CM Revanth Reddy: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 65 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (ఐటీఐ)లను అత్యాధునిక శిక్షణా సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)కి మంగళవారం ఆయన శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో కీలక సమస్య అయిన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే నా ప్రభుత్వ లక్ష్యం అంటూ ఆయన పేర్కొన్నారు.
సాంకేతిక నైపుణ్యాలు ఉండాలి..(CM Revanth Reddy)
ప్రభుత్వ యాజమాన్యంలోని ఐటీఐల ప్రస్తుత స్థితిని ఎత్తిచూపిన రేవంత్ రెడ్డి ఈ విద్యాసంస్థలు ఉత్పాదకత లేకుండా మారాయని పేర్కొన్నారు. ఐటీఐల్లో , 40 నుంచి 50 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన కాలం చెల్లిన కార్యక్రమాలను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఉద్యోగాల కోసం యువతీ, యువకుల సంఖ్య ఎక్కువగా ఉందని అందువలన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. సర్టిఫికెట్లు మాత్రమే జీవన ప్రమాణాలను పెంచవు. సాంకేతిక నైపుణ్యాలు మరిన్ని ఉద్యోగావకాశాలను అందిస్తాయని నా బలమైన నమ్మకమని అన్నారు. కొత్త సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం కింద 65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయడానికి రాష్ట్రం రూ.2,324 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ కార్యక్రమం కోసం టాటా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ అందించడంలో సహకరించిన టాటా యాజమాన్యానికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కోసం విద్యార్థినీ విద్యార్థులు ఐటీఐలలో చేరాలని ఆయన కోరారు. నిరుద్యోగులకు సాధికారత కల్పించేందుకు ఏటీసీల పనితీరును ప్రతినెలా నిశితంగా పరిశీలించి సమీక్షిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.