CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ పెద్దలని కలిసి తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానాలని సమర్పించారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీపై చర్చించారు.
అటు తరువాత తెలంగాణ భవన్‌కి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజనపై సమీక్ష జరిపారు. ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణంపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్‌డి సంజయ్ జాజుతో చర్చించారు. ఉమ్మడి ఎస్టేట్ లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన వాటాను ఖరారు చేయడంపై వారితో చర్చించారు. మరోవైపు ఢిల్లీ తుగ్గక్ రోడ్ 23 లో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసాన్ని అధికారులు సిద్దం చేసారు. ఇంతవరకూ ఈ నివాసంలో కేసీఆర్ ఉండేవారు.ఎంపీగా, కేంద్రమంత్రిగా, సీఎంగా ఆయన చాలాకాలం ఈ నివాసాన్ని వినియోగించారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ ఈ నివాసాన్ని ఖాళీ చేసారు. దీనితో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నివాసంగా అధికారులు మార్చి తగిన ఏర్పాట్లను, సెక్యూరిటీని సిద్దం చేసారు.