CM Jagan:ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా సీఎం జగన్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేసారు.అనంతరం తీర్ధప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, దేవాదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, దేవస్ధానం ఈవో కెఎస్ రామరావు, హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్టు, ఎమ్మెల్సీ మహమ్మద్ రుహుల్లా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఇలాఉండగా తుపాను నష్టంపై బుధవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మానవత్వంతో, సానుభూతితో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.సకాలంలో ముందస్తు చర్యలు చేపట్టి, బాధిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవడంలో జిల్లా కలెక్టర్లు, ప్రత్యేకాధికారులు బాగా పనిచేశారని కొనియాడారు.బాధితులుగా మనం ఉంటే ఏవిధమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటామో అదేవిధమైన సాయాన్ని కష్టకాలంలో కలెక్టర్లు తమకు అందించారని బాధితులు భావించాలని ఆయన సూచించారు.