Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రిటైల్ స్టోర్ మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ చేసినట్టు.. ప్రభుత్వ భూములను సీఎం జగన్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
గత మంత్రి వర్గం సమావేశంలో అనేక కంపెనీలకు విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నవంబర్ 3న ప్రభుత్వం అనేక పరిశ్రమలకు చేసిన భూ కేటాయింపులు విచిత్రంగా ఉన్నాయన్నారు. యువతకు ఉడ్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పారిశ్రామిక విధానం తీసుకొవచ్చామని పదే పదే గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం క్విడ్ ప్రోకో డీల్స్ తో కొన్ని కంపెనీలకు మాత్రమే అనుచిత లబ్ది చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుందని ఆయన ఆరోపించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో చేసుకున్న రూ.13 లక్షలకోట్లు ఎంఓయూలు ఏమయ్యాయని మనోహర్ ప్రశ్నించారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి నిబంధనలతో పనిలేకుండా భూములు కట్టబెట్టిందన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు స్దిరమైన పాలసీ లేకపోవడంతో నాలుగున్నరేళ్లలో లక్షలకోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని రాష్ట్రానికి ఒక కొత్త పరిశ్రమ కూడా రాలేదని అన్నారు.
వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికిభారతదేశంలో అమలవుతున్న ఎస్ఈజెడ్ విధానాన్ని తీసుకువచ్చారు. ఆయన కుమారుడు జగన్ సీఎం అయ్యాక పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వేధించడం మొదలుపెట్టారు. గత ప్రభత్వాలు ఇచ్చిన భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు చేసారు. వీళ్ల బెదిరింపులు తట్టుకోలేక చాలా మంది పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్దితి వచ్చిందన్నారు. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వానికి ఒక స్దిరమైన పాలసీ లేకపోవడంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది క్షీణించిందని మనోహర్ పేర్కొన్నారు.