Chandrababu Naidu:సీఎం జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
పేదలకు మూడు సెంట్ల ఇంటి స్దలం..(Chandrababu Naidu)
మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్నారు.. చేశారా? సీపీఎస్ రద్దు చేస్తా అన్నారు.. చేశారా? జాబ్ క్యాలెండర్ అన్నారు.. మెగా డీఎస్సీ వేస్తా అన్నారు.. వేశారా? అంటూ చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. చిన్న టీ షాపుల్లో కూడా ఆన్ లైన్ పేమెంట్ చేస్తుంటే మద్యం షాపుల్లో ఎందుకు పెట్టడం లేదని ఆయన నిలదీసారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన తొలిసంతకం డీఎస్సీ పైనే అని చంద్రబాబు మరోసారి స్పష్టం చేసారు. ఇంటింటికీ నాలుగువేల రూపాయల ఫించన్ , పేదలకు మూడు సెంట్ల ఇంటి స్దలం ఇస్తామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని , ఏటా మూడు గ్యాస్ పిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ది చేయగలరనేది ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.