CM Chandrababu Released White PaPer:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం భూములు, ఖనిజాలు దోచుకుందని ఆరోపించారు. విశాఖపట్నం, ఒంగోలు, చిత్తూరులో ఇళ్ల నిర్మాణాల ముసుగులో భూకబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు.
ఇళ్ల పట్టాల విషయంలో రూ.3 వేల కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వీటికోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేదలకు చెందిన 10 వేల ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. అయితే లబ్ధిదారులకు మాత్రం ఊరికి దూరంగా ఉండే భూములు, శ్మశాన భూములు, పొలాలకు పోయే భూములు ఇచ్చారన్నారు. వర్షం పడితే కాళ్లు దిగబడే 361 ఎకరాల భూములను ఇళ్ల నిర్మాణాలకు కేటాయించారని పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల కోసం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని తాడేపల్లిలో కూడా నీటిపారుదల శాఖ అభ్యంతరాలు చెప్పినా పార్టీ కార్యాలయం కోసం భూమిని కేటాయించారని వివరించారు. వైసీపీ నేతలు సుమారుగా 40 వేల ఎకరాల అసైన్ మెంట్ భూములను దక్కించుకుని వాటిని ఫ్రీహోల్డ్ కిందకు మార్చాలని అధికారులను బెదిరించారని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో భూములు కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని దీనికోసం గుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెస్తామన్నారు.