CM Chandrababu in Amaravati: అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు.
అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై నిల్చుని నమస్కరించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఐకానిక్ నిర్మాణాల వద్దకు చేరుకున్న చంద్రబాబు.. బిల్డింగ్ ల పరిస్థితిని పరిశీలించారు. అమరావతిలో కొన్ని ప్రాంతాలు పాడుబడ్డాయని సీఎం చంద్రబాబు తన పర్యటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర నిర్మాణం కోసం సేకరించిన మట్టికి పూజ కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.