Pension Distribution in AP: ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని ఇవాళ ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. పెన్షన్ 4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు .3 వేలతో కలిపి మొత్తం 7 వేలు నగదును అందజేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ మొదలైంది.
కాగా సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం లబ్ధిదారు ఇంటికి వెళ్లి సీఎం పింఛను అందజేశారు. కాగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. మొత్తం 65.18 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్ల నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షా 20వేల మంది సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో పాల్గొంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టినట్టు అయింది.
తొలి రోజే 100 శాతం పంపిణీని పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ప్రణాళికలో భాగంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మంది పింఛనుదారులకు పింఛను అందజేసేలా బాధ్యతలు అప్పగించారు. అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి వచ్చిన కొన్ని చోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని అధికారులు వినియోగించుకోనున్నారు. ఇక తొలి రోజు ఏదైనా కారణాల వల్ల.. అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛను అందించనున్నారు