CM Chandrababu Naidu: తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైందని..తిరుమల మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ నినాదం తప్ప వేరేది వినిపించకూడదని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో తిరుమల అపవిత్రంగా మారిపోయిందని..తిరిగి పవిత్రంగా మారుస్తానని తెలిపారు. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని..ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. వెంకటేశ్వరస్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని.. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో..ఆ సంపద పేదవాడికి వెళ్లడం అంతే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని..పేదరికం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తానని తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు..( CM Chandrababu Naidu)
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి.. తీర్థప్రసాదాలు అందించారు.ప్రోటోకాల్ ప్రకారం ఆలయ మహద్వారం నుంచి కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి వెళ్లారు చంద్రబాబు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శనానికి తీసుకెళ్లారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబును కలిసేందుకు టిడిపి నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
శ్రీవారిని దర్శించుకుని ఆలయంలో నుండి బయటకు వస్తున్న చంద్రబాబును చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. భారీ సంఖ్యలో తరలిరావడంతో ఒక దశలో తోపులాటలు ఏర్పడే పరిస్థితి గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును అప్రమత్తం చేశారు. ఆలయంలో భక్తులు ఇబ్బందిపడకుండా తొందరగా ఆలయం వెలుపలికి తీసుకెళ్లారు. ఇద్దరు భక్తులు వేగంగా పరిగెత్తుకుంటూ చంద్రబాబుకు శాలువ, పూల బొకే సమర్పించేందుకు ప్రయత్నించగా.. చంద్రబాబు చూసే అవకాశం లేకుండా సెక్యూరిటీ అడ్డుగా ఉండడంతో ముందుకు వెళ్లిపోయారు. సార్.. సార్.. అంటూ లోకేష్ ను తీసుకోమని భక్తులు కోరగా.. నారా లోకేష్ నివారించారు. ఇలాంటివి ఆలయంలో.. వద్దు.. బయట చూసుకుందాం అని వారించి.. ఎంతో పరిణతి కలిగిన రాజకీయ నేతలా వ్యవహరించారు.