Chandrababu Meets Union ministers: ప్రధాని సహా 10 మంది కేంద్రమంత్రులను కలిపిన సీఎం చంద్రబాబు నాయుడు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని సహా 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు చేశారు.

  • Written By:
  • Publish Date - July 5, 2024 / 05:59 PM IST

Chandrababu Meets Union ministers: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని సహా 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్ దీప్ సింగ్, రాజ్ నాధ్ సింగ్, ఆర్థిక సంఘం చైర్మన్ లతో బాబు భేటీ అయ్యారు. నీతిఆయోగ్‌ ఛైర్మన్‌,సీఈవోలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. నడ్డాతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి భేటీ అయిన చంద్రబాబు.. వైద్య రంగానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతులను వేగంగా మంజూరు చేయాని నడ్డాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాన్ని ఆదుకోవాలి..(Chandrababu Meets Union ministers)

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయిన చంద్రబాబు… రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని అందించారు. ఏపీకి నిధుల కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో వివరించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు.అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని.. పలు ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని నిర్మలను చంద్రబాబు కోరారు. సీఎం విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వీలైనంతవరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు.గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు భూమి ఖర్చు రూ.385 కోట్లు, నిర్వహణ వ్యయం రూ.27.54 కోట్లు విడుదల చేయాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆస్తుల విభజన, ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 47 మరియు 75) కింద సంస్థల విభజన, అలాగే ఏపీ జెన్కో మరియు తెలంగాణ డిస్కమ్‌లు.మధ్య ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ కేడర్ సమీక్ష 2015 నుంచి పెండింగ్‌లో ఉందని షాకు చంద్రబాబు తెలిపారు. కేడర్ సమీక్ష ద్వారా ప్రస్తుత సంఖ్య 79 నుంచి 117కు పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ కేడర్ సమీక్షను వీలైనంత త్వరగా సమీక్షించాలని చంద్రబాబు అమిత్ షా ను కోరారు.