Minister Errabelli Dayakar Rao: ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని అన్నారు.వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్బంగా దయాకర్ ఏపీలో విద్యుత్ పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ ఎకరం భూమి అమ్మితే ఏపీలో 100 ఎకరాలు..(Minister Errabelli Dayakar Rao)
తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తుంటే ఏపీలో మాత్రం ఇంకా కరెంటు కోతలు కొనసాగుతున్నాయని సెటైర్ వేశారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో 100 ఎకరాల భూమి వస్తుందని ఎద్దేవా చేశారు. దీంతో ఎర్రబెల్లి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు కేవలం 7 గంటల ఉచిత కరెంటు ఇచ్చేదన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణను చూసి తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారానికి దిగారని మండిపడ్డారు. గత పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతంలో రైతులు బోర్లు వేసినా నీళ్లు రాలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత సేపు మోటార్లు వేసినా బోర్లలో నీరు పోవడం లేదన్నారు. ఇదంతా కేసీఆర్ దయ వల్లే జరిగిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరిపోతుందని, మూడు గంటలు సరిపోతుందని కొందరు మూర్ఖులు అంటున్నారని విమర్శించారు.ఈ పర్యటనలో మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.