Chinta Mohan Comments: తిరుపతిలో మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్‌కు 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు సీట్లు వస్తాయని ఆయన అన్నారు.
ఏపీ ప్రజల్లో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తోందన్నారు. 1979 పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో కన్పిస్తున్నాయని చింతా మోహన్ అన్నారు. కాపులు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా కీలక సమయమన్నారు.అందువలన చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 50 వేల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అదేవిధంగా కాకినాడ లోక్ సభ స్దానం నుంచి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ స్దానం నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పోటీ చేయాలని ఆయన కోరారు. ఇలా ఉండగా చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత తన పార్టీని కాంగ్రెస్ లోవిలీనం చేసి కేంద్రమంత్రి పదవి పొందారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తరువాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే తన దృష్టి పెట్టారు. గత ఏడాది ఆయన నటించిన వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు విడుదల అయ్యాయి.