Chinna Jeeyar Swamy: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగాయి. చినజీయర్ స్వామి చేతుల మీదుగా గుడిలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది.
పునః నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ త్రిదండి చిన్నజీయర్ స్వామి సీతారాముల విగ్రహ ప్రతిష్ట చేశారు.ఈ కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో హోమగుండ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజులుగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన చిన జీయర్ స్వామి తెలంగాణ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణలో మూడు పూవులు, ఆరు కాయలుగా పాలన సాగుతోందని చినజీయర్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఏ లోటూ లేకుండా చేస్తోంది.పాలకునికి ప్రజల మీద ప్రేమ ఉండాలి. వానలకు, పంటలకు లోటు లేకుండా, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ప్రజల బాగోగులని చూసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం పది కాలాలపాటు చల్లగా ఉండాలని చినజీయర్ కోరుకున్నారు.