Chandrababu Naidu: 1997లో ప్రజా గాయకుడు గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కాల్పుల అనంతరం గద్దర్ తనతో పలుమార్లు మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు. అల్వాల్‌లోని ప్రజా గాయకుడు గద్దర్ నివాసానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులని పరామర్శించారు.
పేదల హక్కులను కాపాడడమే తామిద్దరి లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం సమిష్టి కృషి అని, ఈ అభివృద్ధి యొక్క ప్రయోజనాలు తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ చేరుతున్నాయని ఆయన అన్నారు. వివిధ ప్రజా పోరాటాల్లో గద్దర్ విశేష పాత్రను, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన కృషిని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రజా పోరాటానికి గద్దర్ పేరు పర్యాయపదమని. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రజా యుద్ద నౌక గద్దర్ అమీర్ పేట లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగష్టు 6న కన్నుమూసారు. గద్దర్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గద్దర్ కు చివరిసారిగా భారీ సంఖ్యలో ప్రజలు నివాళులు అర్పించారు.