Site icon Prime9

Super Fast Train : తెలుగు రాష్ట్రాలకు “సూపర్ ఫాస్ట్” గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. త్వరలోనే రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లు

centrail railway board agree to two super fast train lines through telugu states

centrail railway board agree to two super fast train lines through telugu states

Super Fast Train : తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం – విజయవాడ – తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది.

ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విణి వైష్ణవ్‌ను కలిసి లేఖలు సమర్పించారు. ఈ సూపర్‌ ఫాస్ట్ రైల్వే లైన్ (Super Fast Train) ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలో మీటర్ల మార్గంలో రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఇక ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30 వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అందించింది. వీటికి అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ మరియు ఓవర్‌ హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండోదశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్రం చేపడుతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version