YS Viveka murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈ నెల 5న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్‌లో సిబిఐ పలు అంశాలు ప్రస్తావించింది.
8వ నిందితుడిగా అవినాష్ రెడ్డి..(YS Viveka murder case)
వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా చేర్చింది. కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ కౌంటర్‌లో వెల్లడించింది. తండ్రీ, కుమారుడు కలిసి దర్యాప్తుని పక్కదారి పట్టించేందుకు యత్నించారని సీబీఐ ఆరోపించింది.వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వెనక కుట్రపై దర్యాప్తు సాగుతోందని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ హత్యాస్థలికి వెళ్లారని సీబీఐ వివరించింది. అవినాష్, శివశంకర్ రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని సీబీఐ తెలిపింది. ఉదయం 5 గంటల 20 నిమిషాలకంటే ముందే గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ చెప్పింది. కేసు, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్, శివశంకర్ రెడ్డి చెప్పారని సీబీఐ బయటపెట్టింది.
సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని కౌంటర్‌లో పేర్కొన్నారు. ప్రలోభపెట్టేందుకు అవినాష్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్ రెడ్డి ప్రయత్నించారని సీబీఐ తెలిపింది. వివేకా హత్య విషయం సిఎం జగన్‌కు ఉదయం ఆరుంబావుకంటే ముందే తెలుసని సిబిఐ పునరుద్ఘాటించింది. వివేకా పీఏ బయటకు చెప్పకముందే జగన్‌కు తెలుసని గుర్తించామని సీబీఐ వెల్లడించింది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
సాక్షులు ప్రభావితమవుతారు..
కడప, పులివెందులలో భాస్కర్‌రెడ్డి ప్రభావితం చేయగల వ్యక్తని, భాస్కర్‌రెడ్డి బయట ఉంటే పులివెందులలో సాక్షులు ప్రభావితమైనట్లేనని సీబీఐ తేల్చి చెప్పింది. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టం జరుగుతుందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం అబద్ధమని సిబిఐ స్పష్టం చేసింది. ఏప్రిల్ 16 నుంచి జైలులో ఉన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వడానికి కారణం కారాదని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దస్తగిరి విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగానే ఉందని సీబీఐ ప్రకటించింది. దస్తగిరికి కడప కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని సీబీఐ గుర్తు చేసింది. రక్తం తుడవక ముందే ఫొటోలు, వీడియో తీశారని సీబీఐ కౌంటర్‌లో తెలిపింది.