Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదివరకు వైఎస్సార్ హయాంలో 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్‌గా భూమన పని చేశారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన ఉన్నారు. ఈ నెల 8వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియనుంది. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా నియామకంతో ఆయన రెండేళ్లపాటు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 2019లో ఆ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుతం టీటీడీలో చైర్మన్‌తో పాటు 35 మంది పాలకవర్గ సభ్యులు ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్నపుడు దళిత గోవిందం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్ కు స్వయానా పినతండ్రి. ఆయన ఇప్పటికే రెండు దఫాలు ఛైర్మన్ గా పనిచేసారు. త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో వైవీ సుబ్బారెడ్డిని పార్టీ సేవలకు వాడుకోవాలని సీఎం భావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితుడు కావడం, గతంలో టీటీడీ ఛైర్మన్ గా పనిచేయడంతో జగన్ ఈ పదవికి కరుణాకర్ రెడ్డిని ఎంపిక చేసారు. టీటీడీపై ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన సమర్దంగా తిప్పిగొట్టగలరని జగన్ నమ్ముతున్నారు.
గత ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తిరుపతి జిల్లా నుంచి కరుణాకర్ రెడ్డికి స్దానం దక్కుతుందని భావించినా అది మిస్సయింది. అయితే ఇపుడు టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. కరుణాకర్ రెడ్డి 2012లో తిరుపతి అసెంబ్లీ స్దానం నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. 2014 లో అదే స్దానం నుంచి ఓడిపోయిన కరుణాకర్ రెడ్డి మరలా 2019 లో గెలిచారు. ఆయన కుమారుడు భూమన అభినయ్ ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్ద డిప్యూటీ మేయర్ గా ఉన్నారు.