Janasena chief Pawan Kalyan: భరత జాతి చైతన్యమూర్తి భగత్ సింగ్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

భరత జాతి చైతన్యమూర్తి భగత్ సింగ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భరత జాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు షహీద్ భగత్ సింగ్‌ను ఆసేతు హిమాచలం గుండెల్లో పెట్టుకుందన్నారు. తెల్లవారి దాష్టీకాలను ఎదిరించిన ఆ వీరుని జయంతి సందర్భంగా సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 06:58 PM IST

Janasena chief Pawan Kalyan: భరత జాతి చైతన్యమూర్తి భగత్ సింగ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భరత జాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు షహీద్ భగత్ సింగ్‌ను ఆసేతు హిమాచలం గుండెల్లో పెట్టుకుందన్నారు. తెల్లవారి దాష్టీకాలను ఎదిరించిన ఆ వీరుని జయంతి సందర్భంగా సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.

వీరులను యువత గుర్తుంచుకోవాలి..(Janasena chief Pawan Kalyan)

యవ్వన ప్రాయంలో ఉరికొయ్యను ముద్దాడినా… ఆ యోధుడు భరత జాతికి అందించిన చైతన్యం అమూల్యమైనదని కొనియాడారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు భగత్ సింగ్ లాంటి ఎందరో వీరుల ప్రాణత్యాగాల ఫలం అని.. అటువంటి వీరులను యువత ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశ్వనరుడను నేను అని జాషువా చాటుకున్నారని గుర్తు చేశారు. ఆ కవి కోకిల జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నానని తెలిపారు. గుర్రం జాషువా రచనల్లో ఎక్కడా ద్వేషపూరిత భావజాలం ఉండదు, వాస్తవికత కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. కరుణరస ప్రధానంగా సాగిన ఒక ప్రతిఘటన గోచరిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. నవతరం ఆయన రచనల్లోని భావజాలాన్ని గ్రహించాలన్నారు. తామే శాశ్వత చక్రవర్తులం అనుకొనే పాలకులు సైతం గుర్రం జాషువా రచనలు చదివితే మంచిదని హితవు పలికారు.

ముస్లిం సోదర సోదరీమణులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిలాద్ – ఉన్ – నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఇస్లాం మత విశ్వాసులైన వారందరికీ పర్వదినమని ఆయన అన్నారు. ముస్లిం చివరి ప్రవక్త ముహమ్మద్ సొల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన పుణ్యదినమని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికి కీర్తి, సుఖసంతోషాలు, ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ తెలిపారు. తన పక్షాన, జనసేన పక్షాన శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు.

స్వామినాథన్ ఆత్మకు శాంతి కలగాలి..

హరిత విప్లవాకారుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్.స్వామినాథన్ తుది శ్వాస విడిచారని తెలిసి చింతించానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. పెరుగుతున్న మన దేశ జనాభా అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను సమకూర్చేందుకు అవసరమైన వంగడాలను తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. అధిక దిగుబడి ఇచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పన చేయడం వల్లే ఆ దిశగా ఎన్నో ప్రయోగాలు నేటికీ మన దేశంలో సాగుతున్నాయని గుర్తుచేశారు. స్వామినాథన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు.