Ambati Rambabu: నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం తమకు రావాల్సిన వాటా నీటినే తీసుకున్నామని వివరించారు. తమవి కాని ఒక్క నీటి బొట్టునైనా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. సాగర్ లో 13వ గేట్ వరకూ ఏపీకి చెందిన భూభాగమని.. మా ప్రాంతాన్ని మేము తీసుకున్నామని తెలిపారు.
మా చర్య న్యాయబద్దమైనది..(Ambati Rambabu)
కొందరు తెలుగు ప్రజల మద్య వైరుద్యాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమకు తెలంగాణాలో రాజకీయ పక్షం లేదని.. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణాలో ఏ ప్రభుత్వం వచ్చినా.. వారితో సత్సంబంధాలను కొనసాగిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయబద్దమైనదని.. తమ హక్కుల విషయంలో తెలంగాణ జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద తాము ఆధార పడాల్సిన పని లేదని తెలిపారు. ఏపీ భూబాగంలో తెలంగాణ పోలీసులు పహరా ఉండటం సరికాదని వారిని వెళ్లిపోవాలని ఏపీ పోలీసులు చెప్పారన్నారు. తమకు న్యాయంగా రావలసిన వాటా ప్రకారం తాగునీటి అవసరాల కోసం రెండువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకున్నమన్నారు. పరిస్దితి ఇలా ఉండటానికి కారణం గతంలో చంద్రబాబునాయుడు సరిగా వ్యవహరించకపోవడమేనని దానివలనే ఏపీ భూబాగంలో తెలంగాణ పోలీసులు పెత్తనం చలాయిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడంలో చంద్రబాబు దృఢంగా వ్యవహరించలేకపోయారని అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం. మా హక్కులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మేము ముందుకు అడుగు వేసాము. తెలంగాణ ప్రజలు, మేధావులు దీనిని గమనించాలని కోరుతున్నాము. మా హక్కుల ప్రయోజనాలకోసం మేము పోలీసులను పంపితే టీడీపీ నేతలు ఎవరూ మాట్లాడలేదు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మా చర్యలను విమర్శించారు.ఆవిడ బీజేపీ అధ్యక్షురాలా ? టీడీపీ అధ్యక్షురాలా అర్దం కావడం లేదన్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు కూడా సాగర్ డ్యామ్ పై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు గవర్నర్ సమక్షంలో కాంప్రమైజ్ జరిగిందని రాంబాబు అన్నారు.