Deputy CM Pawan Kalyan: కాకినాడ కలెక్టరేట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, అటవీ, పొల్యూషన్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలన్నారు. పవన్ కళ్యాణ్. అభివృద్దితో పాటు.. పర్యావరణ సమతుల్యత కాపాడాలని అధికారులకు సూచించారు. పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదన్నారు పవన్.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. ఏటా వెయ్యి కోట్ల ఇసుక మైనింగ్ జరిగిందన్నారు. కాకినాడ హోప్ ఐలాండ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, కాకినాడ స్మార్ట్ సిటీకి నిధులు వచ్చేలా చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఉప్పాడలో సముద్రం ముందుకొస్తోందని, కోతకు గురవుతున్న ప్రాంతాన్ని రక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విదేశాల్లో మన తెలుగువారే ఎక్కువమంది సీఈవోలుగా పనిచేస్తున్నారని వారి ప్రతిభను ఇక్కడే వినియోగించుకునేలా అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సందర్బంగా 9 నెలల కిందట మిస్సయిన అమ్మాయి కేసును పవన్ ఉదహరించారు. అమ్మాయి తల్లి తన దృష్టికి సమస్య తీసుకురాగానే 48 గంటల్లో ఆమె జమ్మూ కశ్మీర్ లో ఉన్నట్లు గుర్తించామన్నారు. అమ్మాయిని విజయవాడ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో వేలాది మంది అమ్మాయిలు అదృశ్యమయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.