Yuvagalam Yatra: తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో ముఖా ముఖి నిర్వాహించారు. టెక్స్‌టైల్ పార్క్‌లో కొత్త కంపెనీలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు రావడం లేదని నేత కార్మికులు లోకేశ్‌కు విన్నవించారు. చేనేత కార్మికులకు ఇచ్చే బీమా పథకాన్ని రద్దు చేశారన్నారు. నేత కార్మికులకు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని వాపోయారు. ఉత్పత్తులకు నాణ్యత తగ్గిపోతోందని.. అన్ సీజన్‌లో ఉపాధి ఉండటం లేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదటూ సమస్యలు చెప్పుకున్నారు.
కాగా, చేనేత కార్మికుల సమస్యలపై లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా వారికి పలు హామీలు ఇచ్చారాయన.‘సీఎం జగన్ తన తల్లిని, చెల్లిని రోడ్డు మీదకు గెంటేశారు. తల్లి లాంటి కడప జిల్లాకు కూడా అన్యాయం చేశారు. జగన్ పరిపాలనలో చేనేత కార్మికులు బాధితులే. కనీసం కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సమీక్ష చేసే తీరిక కూడా జగన్‌కు లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటాను. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఉన్న 5 శాతం జీఎస్టీ భారం పడకుండా చేస్తాం.
చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశ పెడతాం. ప్రస్తుతం మగ్గాల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం నుంచి సాయం లేక చేనేత కార్మికులు ఇతర రంగాలకు వలస పోతున్నారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఆధారపడిన రైతులు, రంగులు అద్దే కార్మికుల దగ్గర నుంచి మాస్టర్ వీవర్స్ వరకు అందరినీ ఆదుకుంటాం’ అని లోకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.