Minister Pinipe Viswaroop : ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఎలా మారుతాయో ఎవరికి అర్దం కావడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో తాజాగా వైకాపా మంత్రి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలతో జగన్ కి తలనొప్పి ఉండగా.. ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలో అయోమయంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వైకాపా మంత్రి.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ విషయం గురించి పరిశీలిస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. తాను కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాని మంత్రి విశ్వరూప్ తిరుమలలో అన్నారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ.. తాను కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నాని వివరించారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు, పాదయాత్రలు చేసుకోవచ్చని అన్నారు. అయితే, సీఎం కావాలంటే మాత్రం దానికి ఒక లెక్క ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని తెలిపారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే సగానికి ఎక్కువ అంటే కనీసం 88 స్థానాల్లో గెలిస్తే సీఎం కావడం ఒక విధానం అని వివరించారు.
అలా కాక.. పొత్తుతో పోటీ చేస్తే 100 స్థానాల్లో నైనా పోటీ చేయాలని, అందులో కనీసం 50 స్థానాల్లోనైనా గెలవాలని చెప్పారు. ఈ రెండు విధానాల్లో ముఖ్యమంత్రి కావొచ్చని అన్నారు. జనసేన అన్ని స్థానాల నుంచి పోటీ చేయడం ఈ సారికి సాధ్యమయ్యేలా లేదు. అలాగే, 100 స్థానాలను టీడీపీ.. జనసేనకు వదిలిపెడుతుందనేదీ అసాధ్యమే. కాబట్టి, ఈ రెండు రీతుల్లోనూ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు లేవని మంత్రి పరోక్షంగా అన్నారని వైకాపా నేతలు చెబుతున్నారు. చూడాలి మరి సదరు నేతలు ఈ వివాదం పట్ల ఈ విధంగా స్పందిస్తారో అని.