AP Mlc Eletions : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే వైకాపా అధినేత, సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి, సామినేని ఉదయభాను, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కోరముట్ల శ్రీనివాసులు, వల్లభనేని వంశీ మోహన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే.. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. ఈ తరుణంలో నేడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ నుంచి ఏడుగురు సభ్యులు, ప్రతిపక్ష టీడీపీ నుంచి ఒకరు బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు కావాల్సివుండటంతో విప్ లేకుండా జరిగే రహస్య బ్యాలెట్ లో ఏ ఓటు ఎటు పడుతుందనే ఉత్కంఠ నెలకొంది.
మొత్తం ఏడు స్థానాలకు జరుగున్నఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సాంకేతికంగా ఆరు స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉన్నా ఏడు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసంతృప్త ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా పెట్టి క్రాస్ ఓటింగ్ చేస్తారనే అనుమానం ఉన్నవారి లిస్టును తయారు చేసుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 151, టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతును ప్రకటించారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలు వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో టీడీపీ బలం 19కి తగ్గిపోయింది. టీడీపీలో విజయం సాధించి వైసీపీ మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలతో ఆ పార్టీ బలం 155కి చేరింది. మరోవైపు జనసేన నుండి విజయం సాధించిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో ఈ బలం 156కి చేరింది. టెక్నికల్ అంశాల ఆధారంగా బరిలో నిలిపిన ఏడు అభ్యర్ధుల విజయం వైసీపీకి నల్లేరు మీద నడకే. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ పంచుమర్తి అనురాధను బరిలోకి దింపింది. టీడీపీ లెక్క చూస్తే.. 23 మందిలో నలుగురు రెబల్స్ పోను 19 మంది ఉన్నారు. అలాగే ఆనం, కోటంరెడ్డి ఓట్లు పడితే 21 అవుతుంది. అయినప్పటికీ తెదేపా అభ్యర్ధి పంచుమర్తి అనురాధ గెలవడానికి మరో ఓటు దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఈ ఆసక్తికర పోరులో ఎవరు విజయం సాధిస్తారా అని..
బరిలో ఉన్న ఏడుగురు అభ్యర్ధులను గెలిపించేందుకు గాను వైసీపీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యతను కేటాయించారు. ఓటు ఎలా వేయాలనే విషయమై కూడా మాక్ పోలింగ్ ద్వారా చూపారు. మొత్తానికి ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.