Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పులేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో పునరాలోచన లేదని కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది.
ఉద్యోగుల ఆందోళనల దృష్ట్యా నిర్ణయం మార్చుకుంటారా? అని కనకమేడల అడగ్గా.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రతిపాదన లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
ప్రైవేటీకరణకు మార్గం సుగమం(Vizag Steel Plant)
రేషనలైజేషన్ పేరుతో విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలను అమలు చేస్తోంది. ప్రైవేటీకరణను అటు కార్మిక సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పరోక్ష పద్ధతులను ఎంచుకుంది.
నోటితో చెప్పకుండా అన్యాపదేశ ఆదేశాలతో ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. తద్వారా ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
స్టీల్ ప్లాంట్‌లో ఏటా 200 నుంచి 300 మంది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లను రిక్రూట్ చేయడం ఆనవాయితీ. ఈ ప్రక్రియ ఆగిపోయింది.
గత ఏడాది కేవలం ఒక్కరికే విశాఖ ఉక్కులో ఉద్యోగం వచ్చింది. ఒకవైపు ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు,
మరోవైపు యాజమాన్యం విధానాలు నచ్చక రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారితో కర్మాగారం ఖాళీ అవుతోంది.
ఈ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. అయినా సరే యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.
మూడేళ్ల క్రితం విశాఖ ఉక్కులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కలిపి 17,000 మంది ఉద్యోగులు ఉండేవాళ్లు.
ఇప్పుడు వారి సంఖ్య 14,880 కి పడిపోయింది. దాదాపుగా 13 శాతం తగ్గిపోయారు.
ప్రభుత్వం పటిష్టమైన చర్యలు
మరో వైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న కోకింగ్ కోల్, ఐరన్ ఓర్ కొరత సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు.
భారీ పెట్టుబడులతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఏటా 3.2 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకు విస్తరిస్తే ప్రస్తుతం
అందులో మూడింట ఒకటో వంతు మాత్రమే ఉక్కు ఉత్పత్తి జరుగుతున్న విషయం వాస్తవమేనా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అది వాస్తవం కాదని చెప్పారు.