Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మార్చి 3నుంచి 7 వరకు జరుగనున్నాయి. రోజూ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో శ్రీవారు, అమ్మవారు తెప్పలపై దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది. తెప్పోత్సవాల్లో మొదటి రోజు మార్చి 3న సీతా లక్ష్మణ ఆంజనేయ సమితంగా శ్రీరామచంద్ర మూర్తి అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. రెండో రోజు శ్రీ కృష్ణ స్వామి అవతారంలో మూడు సార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాలను దృష్టి లో పెట్టుకుని మార్చి 3, 4 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6, 7 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు. తోమాల సేవ, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.
మార్చిలో విశేష ఉత్సవాలు(Tirumala)
మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు, మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి, మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్థంతి. మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం కార్యక్రమాలు జరుగునున్నాయి.
తాటాకు బుట్టల్లో లడ్డూ ప్రసాదం
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్న తిరుమల తిరుపతి దేవస్ధానం.. తాటాకు బుట్టల్లో లడ్డూ ప్రసాదాన్ని అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయ వేత్త విజయరామ్ తయారు చేసిన బుట్టలను పరిశీలించింది. వివిధ సైజుల్లో ఉన్న బుట్టలను పరిశీలించిన తర్వాత లడ్డూ కౌంటర్లలో వాడకంలోకి తీసుకొస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ బుట్టలు భక్తులకు ఎంత మేరకు ఉపయోగపడతాయనే విషయంపై అధ్యయనం చేసి.. వినియోగంలోకి తెస్తామన్నారు.