Nara Lokesh : టార్గెట్ 2024… “యువగళం” తో నారా లోకేష్ టీడీపీని గద్దె నెక్కిస్తారా ?

  • Written By:
  • Publish Date - December 28, 2022 / 11:40 AM IST

Nara Lokesh : టార్గెట్ 2024 కి ఏపీలో రాజకీయ పార్టీలన్నీ సిద్దమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెదేపా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ ఓటమిని అధిగమిస్తూ మళ్ళీ అధికారాన్ని పొందేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తూ, పర్యటనలతో ప్రజలతో మమేకం అవుతున్నారు. నారా లోకేష్ కూడా ప్రజలతో మమేకం అయ్యేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు. ఇక ఇప్పుడు తన వంతుగా నారా లోకేశ్… వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. నారా లోకేష్ 2024 ఎన్నికలే లక్ష్యంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఏడాదికి పైగా యాత్ర ద్వారామొత్తం 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ వేసుకున్నారు.

పార్టీ నేతలతో పాటు యువత ఎక్కువగా ఈ పాదయాత్రలో పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాదయాత్రకు ‘యువగళం’ పేరును నిర్ణయించారు. మొత్తం 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తెదేపా నేతలు నేడు అధికారికంగా ప్రకటించారు.

యువత, మహిళలు, రైతు సమస్యలు ప్రతిబింబించేలా పాదయాత్ర ఉంటుందని సమాచారం అందుతుంది. గతంలో చంద్రబాబు కూడా 2014 ఎన్నికలకు ముందు ‘వస్తున్నా మీ కోసం’ అంటూ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే తరహాలో నారా లోకేష్ కూడా తెదేపాను అధికారంలోకి తీసుకు వస్తారంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.