Bandaru Satyanarayana Arrest : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఏపీ సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఈ మేరకు ముందుగా విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు.
అయితే బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారని తెలుస్తుంది. సీఎం జగన్‌ను దూషించారని ఒక కేసు నమోదు కాగా.. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి.. గుంటూరులోని అరండల్‌పేట, నగరపాలెంలో పీఎస్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. అరెస్టు తర్వాత బండారు సత్యనారాయణను గుంటూరు నగరపాలెం పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా.. గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో బండారు సత్యనారాయణపై 153ఏ, 354ఏ, 504, 505, 506, 509, 499 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా బండారు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.