Site icon Prime9

Mlc Elections Results : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా హవా.. రెండు చోట్ల జయకేతనం

tdp got 2 places in ap graduate mlc elctions results

tdp got 2 places in ap graduate mlc elctions results

Mlc Elections Results : ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా జరుగుతుంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో ఈ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ మేరకు తాజాగా వచ్చిన ఫలితాలు వైకాపాకి ఊహించని షాక్ ఇచ్చాయి. పట్టభద్రులు అధికార పార్టీకి అనుకోని రీతిలో ఓటమిని కట్టబెట్టారు. శాసన మండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరించి విజయకేతనం ఎగురవేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గ్రాడ్యుయేట్ స్థానాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించగా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపుని సొంతం చేసుకున్నారు. పశ్చిమ రాయలసీమలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది.

ఉత్తరాంధ్ర.. 

ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతం తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో సాధించారు. ఇక్కడ విజయానికి 94 వేల 509 కోటా ఓట్లు అవసరం. మొదటి ప్రాధాన్యంలో చిరంజీవిరావుకు 82,958 ఓట్లు వచ్చాయి. విజయానికి ఇంకా 11,551 ఓట్లు అవసరమయ్యాయి. పోటీలో నిలిచిన 33 మంది స్వతంత్రులు, బీజేపీ అభ్యర్థి మాధవ్ లకు వచ్చిన తృతీయ ప్రాధాన్య ఓట్లలోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకే మెజారిటీ ఓట్లు దక్కాయి.

మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ రమాప్రభకు దక్కిన ఓట్లలో దాదాపు 18 ఓట్లు లెక్కించే సమయానికే విజయానికి అవసరమయ్యే కోటా ఓట్లు చిరంజీవిరావుకు దక్కడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో విజయం ఖాయమైంది. టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు కోటా ఓట్లు 94,509 వచ్చే సరికే వైసీపీ సుధాకర్ కు 59,644 ఓట్ల వచ్చాయి. తొలి ప్రాధన్యాత ఓట్ల కౌంటింగ్ లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు వైసీపీ అభ్యర్థి సీతారాంరాజు సుధాకర్ ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు.

తూర్పు రాయలసీమ..

మొదటి రౌండ్ నుంచి టీడీపీ అభ్యర్థి ఆధిక్యం చూపించారు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి మాగుంట మాధవ్ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక తూర్పు రాయలసీమ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. రెండు ప్రాధాన్యత ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి 1,12,686 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది.

పశ్చిమ రాయలసీమ.. 

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది.ప్రతి రౌండ్ లోనూ టీడీపీ, వైసీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. రాత్రి 9 గంటలకు 8 రౌండ్ల లెక్కింపు పూర్తైంది. మొత్తం 2,45,576 ఓట్లు పోల్ అవ్వగా 1,92,018 ఓట్లను లెక్కించారు. ఇందులో 15,104 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఇంత మొత్తంలో చెల్లని ఓట్లు రావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మిగతా 1,76,914 ఓట్లలో వైసీపీ మద్దతిచ్చిన వెన్నపూస రవీంద్రారెడ్డికి 74,678.. టీడీపీ బలపరిచిన అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాల్ రెడ్డికి 73,229, పీడీఎఫ్ నేత పోతుల నాగరాజుకు 15,254 ఓట్లు వచ్చాయి. రెండు చోట్ల టీడీపీ గెలవడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చి అర్ధరాత్రి డ్యాన్సులు చేశారు.

 

Exit mobile version