Site icon Prime9

Atchannaidu : పవన్ కళ్యాణ్ జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శిస్తే వైసీపీ నేతల ప్యాంటు తడిచిపోయింది – అచ్చెన్నాయుడు

tdp ap president atchannaidu fires on cm jagan

tdp ap president atchannaidu fires on cm jagan

Atchannaidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై.. తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేసిన అచ్చెన్న.. స్కిల్ కేసులో సీఎంతో ఎక్క‌డైనా బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్దంగా ఉన్నామని సవాలు విసిరారు. ఇంకా మాట్లాడుతూ.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శిస్తే వైసీపీ నేతల ప్యాంటు తడిచిపోయిందని అన్నారు.

పవన్ పొత్తులపై ప్రకటన చేయగానే సీఎం జగన్, మంత్రులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. పొత్తు ప్రకటన తర్వాత వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని.. వైసీపీ నేతలు పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారన్నారు. సీఎం జ‌గ‌న్ నోరు విప్పితే అబ‌ద్దాలు త‌ప్పితే వాస్త‌వాలు మాట్లాడ‌టం లేదని.. అవినీతి మ‌ర‌క లేని మ‌హానాయ‌కుడిని అక్ర‌మకేసుతో జైళ్లో పెట్టారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబుకు సంబంధం లేద‌ని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం ఫేక్ అగ్రిమెంట్ అని సీఎం జగన్ ఎలా అంటారని ప్రశ్నించారు. తమ దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకున్న డాక్యుమెంట్ ఉందని.. అవసరమైతే జగన్ కు పంపుతామని చెప్పారు. తనపై ఉన్న కేసులకు జగన్ సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. తాము స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఆధారాలతో సహా వెబ్ సైట్ రూపొందించామని వివరించారు.

కాగా అంతకు ముందు ఈ రోజు ఉదయం నిడదవోలులో నాలుగో విడత ‘కాపు నేస్తం’ నిధులను జగన్ విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అవినీతి చేసిన చంద్రబాబు అరెస్ట్ అయ్యాడని.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం సూత్రధారి చంద్రబాబే అని అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎవరైనా సరే శిక్ష తప్పదన్నారు. అలానే.. ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న మనిషి స్కాంతో అరెస్టైన వ్యక్తిని ప్రశ్నించకుండా ములాఖత్ కు వెళ్లి మిలాఖత్ అయ్యాడని పరోక్షంగా పవన్ మీద సెటైర్లు వేశారు.

Exit mobile version