Site icon Prime9

MP Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు విచారణ.. ఏం చెప్పిందంటే ?

supreme court judgement on mp avinash reddy bail petition

supreme court judgement on mp avinash reddy bail petition

MP Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌‌పై సుప్రీం కోర్టులో నేడు తాజాగా విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ లతో కూడిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నెల 25న విచారణ జరపాలని.. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో ముందస్తు బెయిల్‌పై హైకోర్టు విచారణ జరిపే వరకు కస్టడీ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అయితే వారి విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

మరోవైపు విచారణ సందర్భంగా.. సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు లాయర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం తిరస్కరించడంతో.. ఇప్పుడు సీబీఐ అధికారలు ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇంకోవైపు, సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సీబీఐ తరపున న్యాయవాది హాజరుకాకపోవడం గమనార్హం.

అంతకు ముందు అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తరఫు లాయర్ వాదనలు వినిపించారు. సీబీఐ విచారణకు ఇప్పటికే ఏడు సార్లు హాజరైన విషయాన్ని కోర్టుకు వివరించారు. ఎంపీ విచారణకు సహకరించారని.. ఈ కేసులో ఆయన నిందితుడిని కాదన్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయ్యారని.. ఎంపీ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నాలుగు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 19న విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఎంపీ విచారణకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఎంపీ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు.

అవినాష్ రెడ్డి తల్లిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.. ఈ నెల 21న విచారణకు రావాలని పేర్కొంది. కానీ తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని.. తాను బాగోగులన్నీ చూసుకోవాలని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. తనకు మరో వారం పాటూ గడువు ఇవ్వాలని కోరారు. ఈలోపు సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.

Exit mobile version