Site icon Prime9

Sarpanch: అర్థరూపాయే ఉంది అభివృద్ధి చేయలేం.. నన్నేం అడగొద్దు..!

sarpanch massage

sarpanch massage

Andhra Pradesh: పంచాయతీ ప్రజలకు నమస్కారం. ఖాతాలో అర్థరూపాయి మాత్రమే ఉంది కనుక అభివృద్ధి పనులు చేయలేను కాబట్టి నన్నేం అడగొద్దు ప్లీజ్ అంటూ ఓ సర్పంచ్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి సర్పంచ్‌ కుందరి రామకృష్ణ తన గ్రామ ప్రజలకు ఈ విధంగా విజ్ఞప్తి చేశారు.

విద్యుత్‌ బిల్లుల పేరిట పంచాయతీలకు మంజూరైన 14,15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం తీసేసుకున్న విషయం విదితమే. కాగా ప్రస్తుతం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పంచాయతీ ఖాతాల్లో నిధులు లేవు. దీనితో సర్పంచులు నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. ఈ క్రమంలో చాలామంది సర్పంచులు రోడ్డెక్కి తమ నిరసన తెలుపుతున్నారు. కాగా, వైసీపీ మద్దతుదారుడైన గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి సర్పంచ్‌ కుందరి రామకృష్ణ మాత్రం వాట్సాప్‌ స్టేటస్‌ ద్వారా తన సమస్యను ప్రజలకు తెలియజేస్తున్నాడు.

పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేయాలంటూ గతంలో వారాంతపు సంతలో భిక్షాటనతో నిరసన తెలిపారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల దామనాపల్లి సర్పంచ్ రామకృష్ణ శనివారం నాడు ‘దామనాపల్లి పంచాయతీ ప్రజలకు నమస్కారం, మన పంచాయతీ ఖాతాలో డబ్బులు లేనందున ఎటువంటి అభివృద్ధి పనులూ చేయలేం కాబట్టి నన్నేమీ అడగవద్దు. మీ ఆర్కే’’ అంటూ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టారు. దీన్ని చూసిన పంచాయతీ ప్రజలతో పాటు ఇతర గ్రామాల సర్పంచులు కూడా ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఖాతాల్లో ఆర్థిక సంఘం నిధులను మంజూరు చెయ్యాలని అంటున్నారు.

ఇదీ చదవండి: వైకాపా అసమ్మతి నేత దారుణ హత్య.. వేటకొడవళ్లతో వెంటాడి మరీ..!

Exit mobile version