Site icon Prime9

Sajjala Ramakrishna Reddy: ఆఖరి రోజు వరకూ ఉంటాం.. చేయాల్సినవి చాలా ఉన్నాయ్- ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ

sajjala ramakrishna reddy About early elections in Ap

sajjala ramakrishna reddy About early elections in Ap

Sajjala Ramakrishna Reddy: ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి హడావిడిగా హస్తినకు పయనమయ్యారని.. ఆ విషయమై ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. చాలా సార్లు ఈ విషయాన్ని తాము స్పష్టంగా వెల్లడించినట్టు ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. అలాంటి వార్తలు వాస్తవం కాదని ఆయన వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల కాలాన్ని తాము పూర్తిగా వినియోగించుకుంటామని తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న కలలు, ఆశలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఐదేళ్ల కాలం చివరి రోజు వరకూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలిస్తారని.. ప్రజలకు చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయంటూ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఇందంతా వారి ప్రచారం మాత్రమే(Sajjala Ramakrishna Reddy)

ముందస్తు ఎన్నికలు అనేవి చంద్రబాబు చేస్తున్న గేమ్ ప్లాన్ అని సజ్జల తెదేపాపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సీట్లు, ఓట్ల కోసం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ కలిసి ఆడుతున్న గేమ్‌ ప్లాన్‌లో ఇది ఒక భాగమని ఆయన విమర్శలు గుప్పించారు. ముందస్తు అంటే మా దగ్గర నుంచే వస్తుంది. పవన్ కళ్యాణ్ ను ఒప్పించుకోవడానికి చంద్రబాబు ముందస్తు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన అన్నారు. చంద్రబాబు ఏం చేసినా రాష్ట్రంలో మాత్రం ముందస్తు ఎన్నికలు రావని ఆయన వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దుని సజ్జల సూచించారు. 2024లో కూడా వైసీపీనే అధికారంలోకి రాబోతోందంటూ ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు ఇతరత్రా పథకాలే జగన్ ను మళ్లీ సీఎం చేస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version