Site icon Prime9

MP Raghu Rama Krishnam Raju: ఋషికొండ కటింగ్ ఇప్పుడు రాష్ట్రంలో పాపులర్.. ఎంపీ రఘురామకృష్ణంరాజు

mp-raghurama

mp-raghurama

Andhra Pradesh: ఋషికొండను మొత్తం గుండు కొట్టినట్లుగా కొట్టిన కటింగ్ రాష్ట్రంలోని హెయిర్ సెలూన్ లలో ఇప్పుడు పాపులర్ గా స్టైల్ గా మారిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాత్రింబవళ్లు రుషికొండ పై అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని అది కోర్టు దృష్టికి కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక బీచ్ రోడ్డును మూసివేసి కాలేజీకి విద్యార్థులను వెళ్లకుండా అడ్డుకోవడం చూస్తే, అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నియంతృత్వ పోకడలు పోతున్న ఇటువంటి ప్రభుత్వాలు వస్తాయని ప్రజలెవరికీ ఊహా కూడా వచ్చి ఉండదన్నారు. ఋషికొండ పై అక్రమ నిర్మాణాలు చేపడితే ఆ తర్వాత కూల్చివేస్తామని న్యాయస్థానం పేర్కొనడం పట్ల రఘురామకృష్ణం రాజు విస్మయం వ్యక్తం చేసారు. అక్రమ నిర్మాణాలను తొలుతనే నిలువరించకుండా తరువాత కూల్చివేస్తామంటే పోయేది ప్రజల సొమ్మే కదా అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల పై వడ్డీలు చెల్లించడానికి అప్పులు చేయడం తప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను రఘురామకృష్ణం రాజు స్వాగతించారు. అలాగే అప్పుచేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూడడం కూడా అర్థరహితమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అయితే, ఇదే విషయమై సోషల్ మీడియాలో అప్పు ఇచ్చేది మీరే అయినప్పుడు, తెలిసి తప్పుకు అప్పు ఇవ్వడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. సాక్షులకు పదవులిచ్చి ప్రలోభ పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా సాక్ష్యం ఎలా చెబుతారని ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులైన సాక్షులకు ఉన్నత పదవులు కల్పించారని సహా నిందితులకు జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారని తెలిపారు. మురళీధర్ రెడ్డి పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదని, సహా నిందితుడే ముఖ్యమంత్రి అయినప్పుడు విచారణకు ఎలా అనుమతిస్తారని ఆయన అడిగారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే అవకాశమే లేని చోట, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సాక్షులు సాక్ష్యం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం, సహా నిందితులకు రాజకీయంగా పదవులను ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.

Exit mobile version