Site icon Prime9

Resignations: రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికే ’రాజీడ్రామాలు‘

ycpleader

ycpleader

Amaravati: మూడు రాజధానుల మంట ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా అస్త్రాలను తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వెంటనే పరిపాలన మొదలు పెట్టాలనే డిమాండ్ తో మంత్రులు రాజీనామాలు చేస్తారా ? రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రకటన వల్ల జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఎగ్జిక్యూటివ్ రాజధానికి మద్దతుగా ప్రజలు, ముఖ్యమంత్రి అనుమతిస్తే వెంటనే మంత్రిగా రాజీనామా చేసి ఉద్యమం చేయాలనే ఆలోచన ఉందని ధర్మాన చెప్పారు. ఒకపుడు మంత్రుల రాజీనామా అనే సెంటిమెంటు ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో తెలంగాణా ప్రాంత మంత్రులపై పనిచేసింది. ఇంతకాలానికి మళ్ళీ అలాంటి ఆలోచనే ఇప్పుడు మంత్రి ధర్మాన నోటివెంట వినబడుతోంది. కాకపోతే ఇపుడు రాష్ట్ర విభజన సమస్య లేకపోయినా మూడు రాజధానులకు మద్దతుగా మంత్రి మాట్లాడారు. ఉద్యమం చేయటం కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఉందని ధర్మాన అన్నారు.

ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాదరావు కాకుండా బొత్స సత్యనారాయణ, గుడివాడ్‌ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర మంత్రులుగా ఉన్నారు. ధర్మాన ప్రకటనతో తమ పదవులు ఎక్కడ వదిలేయాల్సి వస్తుందో అని వీరు ఉలిక్కిపడుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ధర్మాన ప్రకటనతో పై మంత్రుల నియోజకవర్గాలు, జిల్లాల్లో కూడా జనాలు రాజీనామా డిమాండ్లు చేసే అవకాశముంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మూడు రాజధానుల మద్దతుగా ఏర్పడిన జేఏసీ నేతలకు ఇచ్చారు. మరికొందరు నాయకులు కూడా రాజీనామాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రాజీనామాల ప్రకటన ఉత్త డ్రామా అయినా లేకపోతే చిత్తశుద్ది ఉన్నా జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికైతే పనికొస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రకటనతో ఆగకుండా ధర్మాన రాజీనామా చేసేస్తే జనాల్లో కూడా సెంటిమెంటును రగిల్చినట్లవుతుంది. అపుడు మంత్రుల రాజీనామాల అంశమే పెద్ద విషయంగా మారే అవకాశమూ లేకపోలేదు.

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో అమరావతి జేఏసీ నాయకత్వంలో పాదయాత్ర జరుగుతోంది. ఈ యాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే సమయానికి అక్కడ రాజీనామాల ప్రకటనలు ఊపందుకుంటే పాదయాత్రను అడ్డుకోవచ్చనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇవన్నీ మంత్రులకు అవసరమే లేదు. మూడు రాజధానులా? లేకపోతే ఏకైక రాజధాని అమరావతా అనే అంశం మీదే 2024 ఎన్నికలకు వెళితే సరిపోతుంది అంటున్నారు పరిశీలకులు. జనాలు ఎలా తీర్పుచెబితే అదే ఫైనల్ కదా అని గుర్తు చేస్తున్నారు.

 

Exit mobile version