Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వలపై పార్లమెంట్ సాక్షిగా కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చి చెప్పింది. పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వచేయనున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం (Polavaram Project)
తొలిదశ సహాయ, పునారావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైందని వెల్లడించారు. ఇప్పటి వరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్టు తెలిపారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉందని.. కానీ జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వకంగా వివరించారు.
కట్టబడి ఉంటారని ఆశిస్తున్నా: కేవీపీ(Polavaram Project)
పోలవరం అంశాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు.. రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. పోలవరం ఎత్తు తగ్గించాలన్న కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రంతో రాజీ పడితే రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే అని కేవీపీ అన్నారు.
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం చేతిలో ఉంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కేంద్ర ఎంత ఒత్తిడి చేసినా, ఇతర రాష్ట్రాల అభ్యంతరాల్లో, భూ సేకణ, పునరావాస, పునర్ నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధుల కావాలనే కారణాలు చూపించినా అంగీకరించొద్దు.
పోలవరాన్ని పూర్తి స్థాయిలో, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందించడానికి కట్టబడి ఉంటారని ఆశిస్తున్నా’ అని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమని.. నిధులు లేవని కేంద్రం పోలవరం ఎత్తు తగ్గించే ఆలోచనలో ఉందని లేఖలో ఆయన ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం రాష్ట్రం చేతుల్లో ఉందని.. కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తలొగ్గవద్దని సూచించారు. ఎత్తు తగ్గితే.. రాష్ట్రం చాలా నష్టపోతుందన్నారు.
ఖర్చు తగ్గించుకోవడానికి కేంద్రం ఎత్తుగడ
పోలవరం రిజర్వాయర్ లెవల్ 150 అడుగుల కంటే తక్కువగా ఉంటే ప్రాజెక్టు నుంచి ఆశించిన ప్రయోజనాలు అందడం అసాధ్యమని కేంద్ర జల సంఘం ఎప్పుడో చెప్పిందన్నారు. పోలవరం రిజర్వాయర్ లెవల్ 140 అడుగులు.. 150 అడుగుల మధ్య కాంటూర్ లో సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని లేఖలో ప్రస్తావించారు. ఈ ఖర్చు తగ్గించుకోవడానికి కేంద్రం ప్రాజెక్టు ఎత్తును 140 అడుగులకు కుదించవలసిందిగా రాష్ట్రంపై ఒత్తిడి చేస్తున్నట్లు కేవీపీ ప్రస్తావించారు.